
జీడిమెట్ల, ఏప్రిల్ 30: పిల్లలను ఎంతో కష్టపడి చదివించి, వారిని ఎలాగైనా ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు అహోరాత్రులు కలలుకంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా వారికి సకల సౌకర్యాలు సమకూర్చి తాము ఆనందంగా పస్తులు ఉంటారు. అయితే కొందరు పిల్లలు కన్నోళ్ల కష్టాన్ని తెలుసుకుని ప్రయోజకులు అయితే.. మరికొందరు గండపెండేరాలు మాత్రం ఏకంగా అమ్మానాన్నలకే టోకరా ఇస్తుంటారు. తాజాగా ఏడో తరగతి చదువుతున్న ఓ పుత్ర రత్నం ఏకంగా తండ్రి దుకాణంలో విడతల వారీగా డబ్బు చోరీ చేసి తన ట్యూషన్ టీచర్ వద్ద దాచుకున్నాడు. ఆనక ఆ డబ్బుతో ఏకంగా ఐఫోన్ కొనేశాడు. ఇంట్లో ఎవ్వరికీ కనబడకుండా దానిని వాడుతున్న సదరు దొంగ కొడుకు యవ్వారం తండ్రి కంట పడింది. తండ్రి తొడపాశం పెట్టడంతో అసలు విషయం కక్కేశాడు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని జీడిమెట్లలో వెలుగు చూసింది. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ మల్లేశ్ వివరాల మేరకు..
జీడిమెట్ల షాపూర్‌నగర్ హెచ్‌ఎంటీ సొసైటీలో నివసించే కమల్ జైన్ అనే వ్యక్తి స్థానికంగా చక్కెర వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఏడో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. కుమారుడు బాగా చదువుకోవాలని తండ్రి కమల్ జైన్.. ఇంటి ఎదురుగా ఉండే సందీప్ గేలో అనే వ్యక్తి వద్దకు ట్యూషన్‌కు పంపించేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల్లనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తండ్రి చేసే వ్యాపారం గురించి బాగా అవగాహన ఉన్న కొడుకు.. ట్యూషన్ మాస్టర్ కొడుకు సాయంతో దుకాణంలో ఏడాదిగా డబ్బులు చోరీ చేయడం ప్రారంభించాడు. ఇలా పలు దఫాలుగా సుమారు రూ.2లక్షల వరకు తండ్రి దుకాణంలో చోరీ చేసి ట్యూషన్ మాస్టర్‌కి అందజేశాడు. ఆ డబ్బులతో వ్యాపారి కొడుక్కి ఐఫోన్ కూడా కొన్నిచ్చాడు. ఆ ఫోన్ ఇంట్లో ఎవరికీ కనబడకుండా వాడసాగాడు. అయితే కొన్నాళ్లకే తండ్రికంట పడింది. దీంతో ఫోన్ ఎక్కడిదని తండ్రి ఆరా తీయడంతో ట్యూషన్ టీచర్ ఇప్పించారని చెప్పాడు.
కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎక్కడివని గట్టిగా నిలదీయడంతో దుకాణంలో తస్కరించిన యవ్వారం బయటపడింది. దీంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సంవత్సర కాలంగా కుమారుడు దుకాణంలోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం, ఖరీదైన ఐఫోన్ కుమారుడు వాడుతున్నా కుటుంబ సభ్యులు గమనించకపోవడం విశేషం. ఇంట్లో పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.