
వికాస్‌కు, హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో వివాహం నిశ్చయమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, ఏప్రిల్ 30న వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్‌లో వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకలో భాగంగా తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ. 31 లక్షల నగదును కట్నంగా అందజేశారు. అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ వినయంగా నిరాకరించారు. తమకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకు మించిన కట్నం తమకు అవసరం లేదని వికాస్ తండ్రి స్పష్టం చేశారు. వరుడి అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇది సమాజానికి ఒక మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.