
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు యెల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. వడగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ పిడుగుల పడే ఛాన్స్ ఉందని IMD చెప్పింది.
తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిజామాబాద్, మంచిర్యాల..నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వడగాలుల కారణంగా ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..