
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనాభా గణనను ఆమోదించడం ద్వారా పెద్ద ట్రంప్ కార్డును వాడింది. కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కుల గణనను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో బిహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన RJD నాయకుడు తేజస్వి యాదవ్ కూడా కుల గణనను డిమాండ్ చేస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం కుల గణనను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్, RJD నుండి ఈ అంశాన్ని లాక్కున్నట్లు అయింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కుల గణనకు సంబంధించి తమ వ్యూహాన్ని పునఃపరిశీలించవలసి ఉంటుంది.
గత కొన్ని సంవత్సరాలుగా, రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీలు కుల గణన డిమాండ్ కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో, ప్రచారాలలో చాలాసార్లు తన ప్రభుత్వం ఏర్పడితే కుల గణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తి వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడంతో ప్రతిపక్షాల వ్యూహాన్ని దెబ్బ కొట్టినట్లు అయింది. ఈ నిర్ణయం బీజేపీకి బీహార్ ఎన్నికలకు ముందు రాజకీయంగా చాలా కీలకంగా మారనుంది. దీని కారణంగా, ఒక ప్రధాన ఎన్నికల అంశం కాంగ్రెస్, ప్రతిపక్షాల చేతుల్లోంచి జారిపోయినట్లే.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు కుల గణనను వ్యతిరేకించాయని బీజేపీ ఆరోపిస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అన్ని జనాభా లెక్కల్లో కులాలను లెక్కించలేదని అన్నారు. కులాల సరైన జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ చూపించలేదని, 2010లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభలో కుల గణనను కేబినెట్‌లో పరిశీలిస్తామని చెప్పారని, అయితే దీని తర్వాత ఒక కేబినెట్ గ్రూప్ మాత్రమే ఏర్పడిందని, ఆ కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల డేటాను సేకరించడానికి బదులుగా సామాజిక-ఆర్థిక సర్వే (SECC) మాత్రమే నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది. కుల గణనను కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా మాత్రమే ఉపయోగిస్తున్నాయని బీజేపీ చెబుతోంది.
కుల గణన అంటే ఏమిటి?
కుల గణనలో దేశ పౌరుల కులం ఆధారంగా డేటాను సేకరిస్తారు. దీని వలన ఏ కులం, ఏ వర్గాల జనాభా ఇంకా సామాజిక ప్రయోజనాలను పొందలేదో తెలుస్తుంది. ఈ జనాభా గణనను మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అయితే ఇప్పటివరకు సామాజిక-ఆర్థిక జనాభా గణన మాత్రమే నిర్వహించారు.