
పండ్లను కస్టర్డ్ పౌడర్, పాలతో చేసే రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్‌ను చల్లచల్లగా తినడానికి ఇష్టపడతారు. పండుగ వేడుకలకు లేదా భోజనానికి రిఫ్రెష్ ముగింపుగా ఏదైనా తీపి పదార్ధం తినాలంటే నిమిషాల్లో రెడీ చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ వైపు దృష్టి సారిస్తారు. ఈ సులభమైన ఫ్రూట్ కస్టర్డ్ వంటకం క్రీమీగా, నోరూరిస్తుంది. ఈ రోజు పంచదార లేకుండా నిమిషాల్లో సిద్ధం చేసుకునే క్రిమీ ఫ్రూట్ కస్టర్డ్ తయారీ విధానం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- చిక్కటి పాలు – అర లీటర్
- కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు
- కస్టర్డ్ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం పొడి లేదా బ్రౌన్ షుగర్ – పావు కప్పు
- మామిడి పండు – అర కప్పు ముక్కలు
- పడిన అరటి పండు = అర కప్పు ముక్కలు
- దానిమ్మ గింజలు – అర కప్పు
- యాపిల్ ముక్కలు – అర కప్పు
- నల్ల ద్రాక్ష – పావు కప్పు
- పచ్చ ద్రాక్ష – పావు కప్పు
- జీడి పప్పు – 8
- పిస్తా – కొన్ని
- బాదం – 8
తయారీ విధానం: స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టి.. నీరు పోసి బాగా మరిగించి.. ఆ నీటిని తీసివేయండి. (ఇలా చేయడం వలన పాలు అడుగు పట్టవు) తర్వాత చిక్కటి పాలు గిన్నెలో పోసి తక్కువ మంట మీద మరిగించండి. ఇంతలో ఒక చిన్న గిన్నె తీసుకుని కస్టర్డ్ పౌడర్ వేసి కాచి చల్లార్చిన పాలు పోసి.. ఈ కస్టర్డ్ పౌడర్ ని ఉండాలి లేకుండా బాగా మిక్స్ చేయండి. పాలు మరిగిన తర్వాత పాలల్లో కలిపిన కస్టర్డ్ వేసి ఉండలు లేకుండా కలుపుతూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దింపి ఒక పక్కకు పెట్టుకోవాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు బెల్లం పొడి లేదా బ్రౌన్ షుగర్ పౌడర్ ని వేసి బాగా కలపాలి. పూర్తిగా చల్లార్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ప్రిడ్జ్ లో పెట్టాలి. ఒక గంట వరకూ ఈ క్రీమీ కస్టర్డ్ ని ప్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇంతలో ద్రాక్ష పండ్లను శుభ్రం చేసుకుని ఒక గిన్నె లో వేసుకోవాలి. యాపిల్, అరటిపండు, మామిడి పండుని సన్నగా కట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలు కూడా సిద్ధం చేసుకోవాలి. తీసుకున్న డ్రైఫ్రూట్స్ ను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమీ కస్టర్డ్ ని ఫ్రిజ్లో నుంచి బయటకు తీసి ఒక్కసారి కలపాలి. అందులో కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలు, డ్రైఫ్రూట్స్ ముక్కలను వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..