
సరైన మార్గదర్శనం, కష్టపడే తత్వం ఉన్న ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతామని నిరూపించింది తెలంగాణ బిడ్డ తుమ్మల స్నికిత. 2020 నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించింది. 720 మార్కులకు గాను ఏకంగా 715 మార్కులు సాధించింది స్నికిత. ఆమె తల్లిదండ్రులు కూడా వైద్య వృతిలోనే ఉండటం, వాళ్ల బాటలోనే తను కూడా నడవాలనుకోవడం, ఆ దిశగా కష్టపడి చదివి సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణకు చెందిన స్నికిత 720 మార్కులకు 715 మార్కులు సాధించి 99.9995611 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అంకితభావం, కృషి, పట్టుదలతో చదివి ఆమె తల్లిదండ్రులను ఎంతో గర్వపడేలా చేసింది. స్నికిత తండ్రి కార్డియాలజిస్ట్ కాగా ఆమె తల్లి గైనకాలజిస్ట్.
టెన్త్ నుంచే ప్రిపరేషన్..
స్నికిత తన నీట్ ప్రిపరేషన్‌ను 10వ తరగతి నుంచే ప్రారంభించింది. అదే విజయానికి బలమైన పునాది వేసింది. ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ప్రిపేరషన్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకుంది. కోవిడ్-19 లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, స్నికిత ప్రిపరేషన్ ఆగలేదు. సిలబస్‌ను ముందుగానే పూర్తి చేసినందున, రివిజన్, టెస్ట్ ప్రాక్టీస్ కోసం స్నికితకు తగినంత సమయం లభించింది. అలాగే ఆన్‌లైన్ క్లాసులు కూడా అటెండ్ అయింది. నీట్ యూజీ ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన స్నికిత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిషన్ పొంది, ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసింది.