
తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయపడిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూమి కంపించింది. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల స్వల్ప భూప్రకంపనలు జరిగాయని స్థానికులు తెలిపారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో 6.56 నిమిషాలకు ఒక సెకను భూమి కంపించింది. కామారెడ్డి జిల్లా టెకిర్యల్‌లో భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో భవనాలు, ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక.. ఇటీవలే రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాలో భూప్రకంపనలు అలజడి రేపాయి. ఆ సమయంలోనే మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. రామగుండం పరిసరాల్లోని ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దాంతో.. భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలను జాతీయ భూకంప కేంద్రంగా ఎన్‌సీఎస్ నిర్ధారించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.