
ప్లాస్టిక్ వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు పరిసరాలకు కూడా హానికరం. అయినప్పటికీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించలేకపోతున్నాము. ప్లాస్టిక్ లేనిదే మనిషి జీవితం లేదు అన్నంతగా రోజులున్నాయి. వాటిని ఉపయోగించన తర్వాత బయట పదేస్తున్నాం. ఇవి మట్టిలో కలవవు. వీటిని మూగ జీవాలు తినే ఆహారం అని భ్రమపడుతున్నాయి. వీటిని తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇందులో ఆవుల సంఖ్య అత్యధికం. ఇది ఇప్పుడు ఏర్పడిన సమస్య కాదు. చాలా సంవత్సరాలుగా పరిష్కారం లేని సమస్యగా సాగుతూనే ఉంది. ఆవులు ప్లాస్టిక్ తినడం మంచిది కాదని అందరికీ తెలుసు. అయినా సరే ఆవులు ప్లాస్టిక్ ని తినకుండా చేయలేకపోతున్నాం. ఈ రోజు అవులకు ప్లాస్టిక్ ఏ విధంగా ప్రమాదకరమో అనేది తెలుసుకుందాం..
నేటికీ ప్లాస్టిక్ అనేక పశువుల మరణాలకు కారణమవుతోంది. మేత మేసే సమయంలో ఆవులు రోడ్లపై పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తినే ధోరణి రోజు రోజుకీ పెరుగుతోంది. ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోయిన జంతువుల కళేబరాలను కాకులు, గద్దలు కూడా ముట్టుకోవు. అంతే కాదు ఆవులను ప్లాస్టిక్ తినవద్దని మనం చెప్పలేము. కనుక వాటి వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం ఈ సమస్యను నివారించవచ్చు. మనం వీలైనంత వరకు ప్లాస్టిక్‌లోని ఆహారాన్ని నిల్వ చేసి బయట పడవేసే పద్దతికి గుడ్ బై చెప్పాలి. జంతువులకు ఆహారంగా ప్లాస్టిక్ సంచుల్లో పెట్టడం వాటిని పారవేయడం మానేయాలి. అప్పుడే ఈ సమస్యను కొంత మేర అయినా తగ్గించడం సాధ్యమవుతుంది.
ఆవులకు ప్లాస్టిక్ తింటే ఏమవుతుందో తెలుసా?
కడుపులో ప్లాస్టిక్‌లు జీర్ణం కావు, దీనివల్ల పశువులు చనిపోతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తినడం వల్ల చనిపోయే జంతువులలో.. ఆవుల సంఖ్య పెరిగింది. ఆవుల దవడల నిర్మాణం వలన వాటికి తాము ఏమి తింటున్నాయో తెలియదట. ఆవులు ఆహారాన్ని నమిలినప్పటికీ.. వాటి పెదవులు వ్యర్థాలను గుర్తించేంత సున్నితంగా ఉండవు. దీని కారణంగా ఆవులు ప్లాస్టిక్‌ను తినేస్తున్నాయని గ్రహించవు. పైగా ఆవులకు జీర్ణ కాని ఆహారాన్ని వాంతి చేసుకునే త్వతం లేదు. కనుక ఆవుల కడుపులోకి చేరుకున్న ప్లాస్టిక్ రోజు రోజుకీ పేరుకు పోయి.. వాటి కడుపులో మిగిలిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర ఆహారాన్ని తినడానికి వీలు లేకుండా చేస్తాయి. చనిపోయిన ఆవుల కడుపులో ప్లాస్టిక్ వ్యర్ధాలు మాత్రమే కాదు, పదునైన ఇనుప ముక్కలు, మేకులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి లోహ వ్యర్థాలు ఆవుల కడుపు , ప్రేగులలోకి ప్రవేశించి వాటి మరణానికి కారణం అవుతున్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)