
అమర్‌నాథ్ యాత్రకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో భక్తులు మంచుతో తయారైన శివలింగాన్ని వీక్షించడానికి పవిత్ర ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం యాత్ర అధికారికంగా ప్రారంభమయ్యే రెండు నెలల ముందు అమర్‌నాథ్ శివలింగం ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా అధికారిక అమర్‌నాథ్ యాత్ర జూలైలో ప్రారంభం కానుండగా కొంతమంది భక్తులు ఇప్పటికే పవిత్ర గుహకు చేరుకుని పవిత్ర శివలింగ దర్శనం చేసుకొని, ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నుండి అధికారులు లేదా భద్రతా సిబ్బంది ఎవరూ గుహ వద్దకు చేరుకోలేదు. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మంచుతో కప్పబడిన మార్గాలను క్లియర్ చేయడానికి అధికారులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. రెండు ప్రధాన మార్గాలైన బాల్టాల్, చందన్‌వారీలలో మంచు తొలగింపు పనులు ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం మార్గాలపై మంచు భారీగా ఉంది. కొన్ని ప్రాంతాలలో మంచు 10 నుండి 20 అడుగుల వరకు ఉంటుందని, మార్గం క్లియర్ చేయడంలో ఇబ్బంది ఎదురువుతుందని సమాచారం.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం శ్రీనగర్‌లోని పంథా చౌక్‌లోని అమర్‌నాథ్ యాత్ర రవాణా శిబిరాన్ని సందర్శించి యాత్రకు జరుగుతున్న సన్నాహాలను పరిశీలించారు. తాజా నివేదికల ప్రకారం.. యాత్ర కోసం ఇప్పటికే 360,000 మందికి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. అధికారిక తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 అమర్‌నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ పండుగతో ముగుస్తుంది. ఎప్పటిలాగే, దేశం నలుమూలల నుండి భక్తులు అమర్‌నాథ్ గుహకు ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి