
దటీజ్ భారత్. పాకిస్థాన్‌పై పాక్ ప్రజలకే నమ్మకం లేదూ అంటే.. ఆ దేశం పోరాటానికి ముందే ఓడిపోయినట్లు అర్థం. ఇది కాదా.. ప్రతీకారం అంటే! యుద్ధమంటే బాంబుల వర్షం కురిపించడం, శతఘ్నులను గురిపెట్టడమా? విమానాలు శత్రుదేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్లా? క్షిపణులు ఎక్కుపెడితేనే సమరభేరి మోగినట్టా? కానే కాదు.. ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు. విల్లంబులు సంధించే యుద్ధాలు కావు. రక్తం కళ్లజూస్తేనే, శత్రువు లొంగిపోతేనే విజయమనుకునే రోజులు ఎప్పుడోపోయాయి. బొందిలో ప్రాణమున్నా ఊపిరి ఆపేయొచ్చు. బలప్రయోగం చేయకుండానే కాళ్లూచేతులు కట్టేయొచ్చు. పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ చేస్తోంది అదే. ఆ లెక్కన పాకిస్తాన్‌పై భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసింది. వరుస స్ట్రయిక్స్‌తో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది.
వాటర్ స్ట్రయిక్‌తో పాకిస్తాన్‌పై యుద్ధం మొదలుపెట్టేసింది భారత్. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దుచేయడం శత్రువు ఊహకైనా అందని మేజర్ ఎటాక్. ఇప్పుడా నదిపై ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతోంది మేరా భారత్. సింధు ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇవ్వాలి. కానీ ఒప్పందమే రద్దయిపోవటంతో పాకిస్తాన్‌కి చెప్పడానికేం లేదు.. చేసుకుంటూపోవడమే..! చీనాబ్ నదిపై సలాల్ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేయటంతో పాకిస్తాన్ గొంతు ఎండటం మొదలైంది.
బయటికెళ్తే తలెత్తుకోలేకపోతున్నాం. ఇది పాకిస్థాన్ జర్నలిస్టుల మాట. ఉగ్రవాదులను పెంచిపోషించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో రగిలిపోతున్నారు పాక్ ప్రజలు. ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇస్లామాబాద్‌లోని లాల్‌మసీదులో జరిగిన ఘటనే నిదర్శనం. భారత్‌తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలానా అడిగితే.. ఒక్కటంటే ఒక్క చెయ్యీ పైకిలేవలేదు. పాక్‌లోని అంతర్గత రాజకీయాలు, ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు విసిగి పోయారు. పాలకులతో పాటు సైన్యంపైనా నమ్మకం కోల్పోతున్నారు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్‌కి ఇంతకంటే ఘోర అవమానం ఏముంటుందా?
ఇస్లామాబాద్ లాల్ మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత రేపుతున్న భారత్-పాక్ యుద్ధానికి ఎంత మంది మద్దతిస్తారని మత పెద్దలు ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు అనుకున్న రీతిలో జవాబు దొరకలేదు. ఒక్క పాక్ పౌరుడు కూడా యుద్ధానికి మద్దతు తెలపలేదు. శత్రుదేశం అయిన పాక్ పౌరుల నుంచి ఇలాంటి స్పందన లభించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పాక్ సహా ముస్లిం దేశాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారు. కానీ భారత్‌లో అలాంటి పరిస్థితులు లేవని ముస్లిం మతపెద్దలు అభిప్రాయపడుతున్నారు.
కాశ్మీర్ అందాలను ఆస్వాదిద్దామని సరదాగా వెళ్లిన భారత పౌరులు విగత జీవులుగా తిరిగి రావడం దేశంలో తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ క్రమంలోనే పాక్ కవ్వింపు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత ఆర్మీ పనితీరును చూస్తే రేపు యుద్ధం వస్తే ధీటుగా జవాబిస్తుందనే మాటలు అంతటా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇస్లామాబాద్ లాల్ మసీదులో పాక్ పౌరులు యుద్ధం పట్ల చూపించిన విముఖత స్పష్టమవుతోంది. పోనుపోను ఏం జరుగుతుందనే టెన్షన్ పాకిస్థానీయుల్లో మొదలైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..