Summer Holidays 2025: ఇంటర్‌ సెకండియర్ తరగతులు ప్రారంభం.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?

అమరావతి, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ఫలితాలు వచ్చేవారం చివరి నాటికి వెలువడే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూటమి సర్కార్‌ ఇంటర్‌ విద్యలో కీలకమార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ తరగతులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే ప్రారంభమైనాయి. ఈనెల 23వ తేదీ వరకు ఇంటర్ తరగతులు జరుగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి మే 30వ తేదీ వరకు ఇంటర్ విద్యార్ధులకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్ 1వ తేదీ జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం అవుతాయి. ఇంటర్ విద్యలో సంస్కరణల తరువాత ప్రవేట్ కాలేజీలకు దీటుగా ప్రయత్నాలు మొదలు పెట్టిన ఏపీ ఇంటర్ బోర్డు ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.

ఏప్రిల్ 7వ తేదీ నుంచే 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రవేట్ కాలేజీల తరహాలో అడ్మిషన్ల కోసం ప్రభుత్వ కళాశాలల్లోనూ ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రద్దుచేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారు. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని అమల్లోకి తెచ్చారు. తాజాగా విద్యా సంవత్సరాన్ని సైతం ముందుకు తీసుకొచ్చి జూన్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్‌ విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ఏటా మార్చిలో జరిగే ఇంటర్‌ పరీక్షలు ఇకపై పిబ్రవరిలోనే జరగన్నాయి. దీంతో పని దినాలు 215 రోజుల నుంచి 235 రోజులకు పెరగనున్నాయి. అలాగే ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఐదు స‌బ్జెక్టుల విధానం అమ‌లు చేస్తున్నారు. ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో రెండు భాషా స‌బ్జెక్టులు, నాలుగు కోర్ స‌బ్జెక్టులు మొత్తం ఆరు స‌బ్జెక్టులు ఉన్నాయి. ఆర్ట్స్ గ్రూప్‌లో రెండు భాష స‌బ్జెక్టులు, మూడు కోర్ స‌బ్జెక్టులు మొత్తం ఐదు స‌బ్జెక్టులు ఉన్నాయి. ఇక నుంచి ఏ గ్రూపులో అయినా ఐదు స‌బ్జెక్టులే ఉంటాయి. ఒక్క ఎంబైసీపీ గ్రూప్‌లో మాత్రం ఆరు స‌బ్జెక్టులు ఉండనున్నాయి. అన్ని గ్రూపుల‌కు రెండేళ్ల‌కు క‌లిపి 1,000 మార్కుల విధానం అమ‌ల్లో ఉంటుంది. సైన్స్ స‌బ్జెక్టుల‌కు థియ‌రీకి 85 మార్కులు, ప్రాక్టిక‌ల్స్‌కు 30 మార్కులు కేటాయిస్తారు.

కొత్త విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎన్‌ఈఈఆర్‌టీ సిలబస్‌ను అమలు చేయనున్నారు. 10వ తరగతి ఫలితాలతో సంబంధం లేకుండా హాల్‌టికెట్‌ ఆధారంగా ఏప్రిల్‌ 7 నుంచి ప్రవేశాలు నిర్వహించనున్నారు. అదేరోజు నుంచి ఇంటర్‌ ప్రథమ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. ఆంగ్ల భాష కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, గణితంలో బేసిక్స్, రసాయన, భౌతిక శాస్త్రాలకు సంబంధించి ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా ఇస్తారు. ఇంటర్‌ విద్యలో తీసుకొస్తున్న ఈ సంస్కరణలు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాల అమలు వల్ల ప్రభుత్వ కళాశాలల్లో చేరికలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by TV9telugu websites. This website is not to be held responsible for any of the content displayed.