
అక్రమ సంబంధంతో భార్యను కడతేర్చాడు ఓ భర్త.. భార్య అక్కపై కన్నేసి.. తాళి కట్టిన భార్యను నిత్యం వేధింపులకు గురిచేశాడు. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన భార్యను విపరీతంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. అయితే అతి తెలివి ఉపయోగించి గుండెపోటుతో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియురాలిపై మోజులో కట్టుకున్న భార్యను అడ్డ తొలగించుకోవాలనుకున్నాడు. అక్రమ సంబంధం కోసం తాళి కట్టిన భార్యను అంతం చేశాడు భర్త అనిల్. వదినపై వ్యామోహంతో కట్టుకున్న భార్య సాహితిని చంపేశాడు భర్త రేగుల అనిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితికి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్ అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలు క్రితం వివాహం పెద్దల సమక్షంలో జరిపించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న అనిల్ వివాహం అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురం.. ఆ తర్వాత సాహితి అక్కపై కన్నేసి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం బయటపడటంతో తరుచు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్య సాహితిని నిత్యం వేధింపులకు గురి చేశాడు అనిల్. గతంలో పలుమార్లు అనిల్ పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే మరోసారి భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భార్య సాహితిని విపరీతంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పాల్వంచలో ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులకు, ఫోన్ చేసి.. సాహితి గుండె పోటుతో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
మృతురాలు తల్లిదండ్రులు, బంధుమిత్రులు హైదరాబాద్ వెళ్లి మృతదేహాన్ని పాల్వంచకు తరలిస్తున్న తరుణంలో ఆమె ఒంటిపై గాయాలను గుర్తించారు. దీంతో బంధువులు నిలదీయడంతో భర్త అనిల్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో భర్తతోపాటు అత్తామామలపై ఫిర్యాదు చేశారు మృతురాలు కుటుంబీకులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..